విజయనగరం రైలు ప్రమాదానికి వేగమే కారణం.. అధికారుల ప్రాథమిక నిర్ధారణ
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో ఇటీవల ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘోర రైలు ప్రమాదానికి వేగ నియంత్రణ పాటించక పోవడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తేల్చారు. రైలు కొన్నిచోట్ల తక్కువ వేగంతో ప్రయాణించాల్సి ఉండగా అధిక వేగంతో వెళ్లినట్లు ‘స్పీడ్ రికార్డు’లో గుర్తించినట్లు సమాచారం.ఈ మార్గంలో ఆ డ్యూటీ ఛార్ట్ ప్రకారం ఆ మార్గంలో రైలు కొన్ని చోట్ల 15 కి.మీ., మరికొన్ని చోట్ల 20 కి.మీ. వేగంతో వెళ్లాలని అధికారులు తెలిపారు. వేగ నియంత్రణ హెచ్చరికలను పక్కన పెట్టి దూసుకువెళ్లడం అనుమానానికి తావిస్తోందని చెప్పారు. అలమండ, కంటకాపల్లి స్టేషన్లలో ఆ రోజు, ముందు రోజు విధినిర్వహణలో ఉన్న సిగ్నల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్, లోకో పైలట్లు, స్టేషన్ మేనేజర్లు, గార్డులు, టీటీలతో పాటు గ్యాంగ్‌మన్లను రైల్వే భద్రత కమిషనర్ ప్రణ్‌జీవ్ సక్సేనా విచారణకు పిలిచారు. 20 అంశాలతో కూడిన ప్రశ్నావళిని ఇచ్చి.. మొదటి రోజు 70 మంది నుంచి వివరాలు సేకరించారు. సుమారు 200 మంది నుంచి వివరాలు సేకరించి, తుది నివేదిక సమర్పించనున్నట్లుసక్సేనా తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది.