ఆంధ్రప్రదేశ్

వాడీవేడీగా నెల్లూరు.. మేకపాటి Vs ఆనం

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, నెల్లూరు :- రసవత్తర రాజకీయాలకు కేరాఫ్ నెల్లూరు జిల్లా. అధికార పార్టీ అయినా.. ప్రతిపక్షమైనా రాజకీయాలు ఎప్పుడూ వాడీవేడీగా ఉంటాయి. వర్గ విభేదాలు, విమర్శలు, ఆరోపణలతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేంత పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో ఓ నియోజకవర్గంలో రెండు బలమైన రాజకీయ కుటుంబాల మధ్య రసవత్తర పోరు జరగబోతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గమేంటి..? ఆ నాయకులు ఎవరు..? కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా నెల్లూరు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 10 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే.. ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి మరింత పటిష్టమైన కంచుకోటగా ఉంది.

మేకపాటి కుటుంబీకులు వరుసగా మూడుసార్లు అక్కడ సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి… రెండోసారి విజయాన్ని సొంతం చేసుకుని తన హవా కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు… ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నుంచి వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాస్తవానికి మొదట ఆయన ఆత్మకూరు నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి చూపలేదు. తాజాగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆత్మకూరు నుంచి ఆనం బరిలో ఉన్నారు. దీంతో రెండు బలమైన రాజకీయ కుటుంబాల మధ్య రసవత్తర పోరు జరగబోతుంది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు రాజకీయం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఆత్మకూరులో బలమైన రాజకీయ కుటుంబాల మధ్య పోటీ జరగనుంది.

2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు ఎన్నికలతో పాటు 2022లో జరిగిన ఉపఎన్నికల్లో కూడా మేకపాటి కుటుంబం… ఆత్మకూరులో విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఆత్మకూరు నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన రెండోసారి విజయం సాధించడంతో పాటు జగన్ క్యాబినెట్‌లో కీలకమైన మంత్రిగా పని చేశారు. దురదృష్టవశాత్తు ఆయన 2022లో మరణించడంతో ఆత్మకూరులో ఉపఎన్నిక జరిగింది.

ఆ ఎన్నికల్లో గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో దిగి.. భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా విక్రమ్ రెడ్డి వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ విజయమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ప్రతి గ్రామంలోనూ మేకపాటి సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకొని.. ఎలాగైనా ఈసారి గెలవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆత్మకూరులో విక్రమ్ రెడ్డిని ఢీకొట్టేందుకు బలమైన రాజకీయ చరిత్ర ఉన్న అక్కడ పనిచేసిన అనుభవం కలిగిన ఆనం రామనారాయణ రెడ్డిని TDP నుంచి పోటీకి దింపింది.

జిల్లాలో ఆనం కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2009 ఎన్నికల్లో మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో పాటు YSR, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో కీలకమైన శాఖలతో పాటు ఆర్థికమంత్రిగా చక్రం తిప్పారు. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఆనం నిలిచారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన తర్వాత..ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఆ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వరుసగా రెండోసారి పోటీ చేసిన ఆనం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. తర్వాత మారిన సమీకరణాలతో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వెంకటగిరి అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. తర్వాత జిల్లాలో చోటు చేసుకున్న వివిధ సంఘటనల నేపథ్యంలో ఆయన వైసీపీకి దూరమై….తెలుగుదేశం పార్టీలో చేరారు.

ప్రస్తుత ఎన్నికల్లో TDP భ్యర్థిగా ఆత్మకూరు నుంచి రంగంలోకి దిగారు. 2009లో ఆత్మకూరు నుంచి గెలుపొంది రాష్ట్రంలో మంత్రి పదవి నిర్వహించిన ఆనం రామనారాయణరెడ్డి.. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి మళ్లీ విజయాన్ని ఇస్తుందనే ధీమాతో ఉన్నారు. అయితే మేకపాటికి కంచుకోటగా ఉన్న ఆత్మకూరులో టిడిపికి ఏ మేరకు రాజకీయ సమీకరణాలు అనుకూలంగా ఉంటాయో లేదో వేచి చూడాలి. పక్కా ప్రణాళికతో ఆత్మకూరులో విజయాన్ని రెండోసారి నమోదు చేసుకోవాలని ముందుకి సాగుతున్నారు విక్రమ్ రెడ్డి. ఆత్మకూరు నుంచి కాంగ్రెస్, వైసీపీలే అత్యధిక సార్లు విజయం సాధించాయి. తెలుగుదేశం నుంచి గతంలో తక్కువ మంది మాత్రమే గెలిపొందారు. యువకుడైన విక్రమ్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తారా.. సీనియర్ అయిన ఆనంకి పట్టం కడతారా అనేది మరికొన్నిరోజుల్లో తేలనుంది.

Leave a Reply