ఆంధ్రప్రదేశ్

వంశీకృష్ణకు సౌత్ సెగ.. జనసేనానికి హెచ్చరికలు

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, విశాఖ :- విశాఖ సౌత్ లో సుర్రు సుమ్మంటోంది. జనసేన నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు లోకల్ గా అసమ్మతి మొదలైంది. సీటు ఇవ్వనేలేదు.. అప్పుడే ప్రచారం ఏంటని ప్రశ్నిస్తున్నారు సౌత్ జనసైనికులు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తికి సౌత్ సీటు ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. తమ మాట కాదని సీటు ఇస్తే.. పరిస్థితులు మారుతాయని పరోక్షంగా జనసేనానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ విశాఖ ప్రజలకు బాగా పరిచయమైన వ్యక్తి. వైజాగ్ వైసీపీలో ఒకప్పుడు కీలకంగా ఉన్న నాయకుడు. ఆ పార్టీలో ప్రాధాన్యత లేదని జనసేనలో చేరారు. అయితే వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పడకపోవడం.. వైజాగ్ తూర్పు సీటు కూడా ఆయనకే కేటాయించడం వంశీకృష్ణ కోపానికి కారణమైంది. ఆ తర్వాత జనసేనలో జాయిన్ అయ్యారు. ఇక అప్పటి నుంచి వైసీపీ నాయకులపై విమర్శల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఎంవీవీని ఓడించడమే తన టార్గెట్ అని ప్రకటించేశాడు.

జనసేనలో చేరినత తర్వాత విశాఖ తూర్పు, గాజువాక తప్ప ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నానని వంశీకృష్ణ తనకుతానే ప్రకటించేసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం వరకు భీమిలి నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. టీడీపీ జనసేన పొత్తు తర్వాత కేవలం ఐదు సీట్లు ప్రకటించి.. వంశీకృష్ణ అభ్యర్థితత్వంపై నిర్ణయం తీసుకోలేదు. తర్వాత పవన్ కల్యాణ్ స్వయంగా వాళ్ల పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కార్డు రూపంలో పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ ఒక ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ ఇన్విటేషన్ పై వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విశాఖ సౌత్ నియోజకవర్గం అని ఉండడంతో ఆయన సౌత్ నుండి పోటీలో ఉండబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా తన ప్రచారాన్ని మొదలుపెట్టి నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది. అయితే వంశీకృష్ణ సౌత్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండడంతో అసమ్మతి సెగలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వంశీకృష్ణ జనసేన పార్టీలో జాయిన్ అయిన నాటి నుండి కలిసిమెలిసి తిరిగిన సౌత్ నియోజకవర్గంలోని కార్పొరేటర్ సాధిక్, సౌత్ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ముగి శ్రీనివాసరావుతో పాటు కార్యకర్తలు వంశీకృష్ణకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తికి సీటు ఇవ్వద్దని మరోసారి జనసేనాని పునరాలోచించాలనే విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గంలో జెండా పట్టుకుని తిరగని వ్యక్తికి ఎలా సీటు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు ఇదే వంశీకృష్ణకు తలనొప్పిగా మారింది. నిన్న మొన్నటి వరకు భీమిలి నుండి పోటీ చేస్తానని చెప్పిన వంశీకృష్ణ ఇప్పుడు సౌత్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండడంతో తమ అసమ్మతిని తెలియజేస్తూ వారంతా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసే పనిలో ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలో రెండు సార్లు పోటీ చేసి రాష్ట్రంలోనే అత్యధిక తక్కువ ఓట్లు సంపాదించిన వ్యక్తిగా రికార్డు పొందిన వంశీకృష్ణ సౌత్ నియోజకవర్గంలో ఎలా గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు తప్ప సౌత్ నియోజకవర్గంలో ఎవరికి సీటు ఇచ్చిన గెలిపిస్తామని లోకల్ కేడర్ చెబుతోంది.

ఇది ఇలా ఉంటే సౌత్ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మెడకు మరో వివాదం చుట్టుకుంది. నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రచారం చేస్తున్న సమయంలో కొందరు గణేష్ అనే జనసైనికునిపై దాడి చేశారని విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వంశీకృష్ణ సమక్షంలోనే జనసేన కార్యకర్తల పై దాడి చేస్తే రానున్న ఎన్నికల్లో విజయం ఎలా సాధిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గం కానీ విశాఖ సౌత్ నియోజకవర్గం కానీ కన్ఫామ్ కాకుండానే వంశీకృష్ణ సౌత్ నియోజకవర్గంలో ప్రచారం చేయడాన్ని మాత్రం విశాఖ సౌత్ నియోజకవర్గం జనసేన వింగ్ జీర్ణించుకోలేకపోతోంది. విశాఖ సౌత్ నియోజకవర్గంలో వంశీకృష్ణ సామాజికవర్గ ఓటర్లు కూడా ఎక్కువగా లేరని గుర్తు చేస్తున్నారు.

ఇంకా జనసేన పార్టీ నుండి బీఫామ్ రాలేదు. ఎన్నికల ప్రచారం కూడా జోరుగా చేయడం లేదు. అంతలోనే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు వ్యతిరేకంగా విశాఖ సౌత్ లోని అసమ్మతి వర్గం వంశీకృష్ణ వద్దు లోకల్ వ్యక్తి ముద్దు అంటూ కొత్త పంచాయతీకి తెరలేపింది. దీంతో ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఇంకా మూడేళ్లకుపైగా ఎమ్మెల్సీ పదవి ఉన్నా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ విభేదాలతో వైసీపీకి రాజీనామా చేసిన వంశీకృష్ణ ఇప్పుడు అటు జనసేనలో కూడా వ్యతిరేకత రావడంతో ఏం చేయబోతున్నాడు అనే చర్చ విశాఖ నగరంలో సాగుతుంది. జనసేన పార్టీకి బలమైన కేడర్ గా ఉన్నటువంటి కార్పొరేటర్లు నియోజకవర్గ ఇన్చార్జిలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు సహకరించకపోతే గెలుపు అనేది కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. మరి అసమ్మతి వర్గాన్ని వంశీకృష్ణ ఎలా మేనేజ్ చేస్తాడు అన్నది ఇక్కడ కీలకం కానుంది.

Leave a Reply