వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్రపై సీబీఐ సంచలన రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ పోలీసులు.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. వివేకా హత్య గురించి ఉదయ్ కి ముందే తెలుసని.. హత్య(Viveka Murder Case) జరిగిన రోజు అవినాశ్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని సీబీఐ తెలిపింది. హత్య జరిగిందని తెలిశాకే ఉదయ్ బయటకు వచ్చినట్లు పేర్కొంది. అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy), భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలంలోని ఆధారాలను చెరిపేశారని చెప్పింది. ఈ కేసులో ఉదయ్ ని ఎన్నిసార్లు విచారించినా సహకరించలేదని.. అందుకే పారిపోతాడనే అనుమానంతో అరెస్ట్ చేశామని రిపోర్టులో స్పష్టంగా తెలియజేసింది. కాగా ఉదయ్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సోమవారం సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.