కన్నడ తీర్పు.. కాంగ్రెస్ జోరు.. మేజిక్ ఫిగర్ ఖాయం..!
సాగర్ ఎక్స్ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఓటర్లు 38 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగించారు. అధికార పార్టీని ఇంటికి పంపే ఆనవాయితీని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేశారు. ఫలితాల ట్రెండ్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. స్పష్టమైన మెజార్టీ సాధించబోతోంది. ఇప్పటికే 115కుపైగా స్థానాల్లో హస్తం పార్టీ లీడ్ లో ఉంది. బీజేపీ 80 స్థానాల లోపే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీఎస్ 25 సీట్లు వరకు సాధించే పరిస్థితి ఉంది. ఇతరులు దాదాపు 5 చోట్ల లీడ్ లో ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించడం ఖాయమే.
చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగితే కన్నడనాట అధికారం దక్కించుకోవడం కాంగ్రెస్ కు ఇక లాంఛనమే. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు కన్నడ ప్రజలను ఆకర్షించాయి. నందిని పాల వివాదం బీజేపీకి దెబ్బకొట్టింది. ఆ వివాదం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. రైతులు హస్తం పార్టీకే జై కొట్టారని ఫలితాల ద్వారా స్పష్టమవుతోంది. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ వివాదాన్ని రేపిన ఆ ప్రభావం ఓట్లపై పడలేదని అర్ధమవుతోంది. ఈ విషయాన్ని సామాన్య ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు.
కాంగ్రెస్ పార్టీ బీజేపీకి దీటుగా నిర్వహించిన ప్రచారం బాగా పనిచేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్ షోలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయం కోసం శ్రమించారు. అందుకే కన్నడనాట హస్తం హవా కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి.