‘డబ్బింగ్ ఆర్టిస్ట్’ నుంచి ‘డైలాగ్ కింగ్’ వరకు.. సాయి కుమార్ సినీ ‘ప్రస్థానం’ ఇదే..!
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, హైదరాబాద్ :- తన గంభీరమైన స్వరంతో, విలక్షణ నటనతో తెలుగు పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి..
‘అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు, విలన్లు లేరన్నాటకంలో’.. అంటూ తన గంభీరమైన స్వరంతో, విలక్షణ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాయి కుమార్.. పూర్తి పేరు పుడిపెద్ది సాయి కుమార్. 1960 జులై 27న జన్మించాడు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఆవైపు ఆకర్షితుడయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా డబ్బింగ్ సినిమాలకు పని చేసిన ఆయన.. పెద్దయ్యాక కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కొనసాగాడు. 1977లో ‘స్నేహం’ ద్వారా నటనలోకి అడుగుపెట్టాడు. కానీ ఆయన సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘పోలీస్ స్టోరీ’. 1996లో కన్నడనాట ‘పోలీస్ స్టోరీ’ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.
ఆవేశం ఉన్న పోలీసాఫీసర్ అగ్ని పాత్రలో అద్భుతంగా నటించాడు. ఎంతలా అంటే అప్పటి తరం ఆడియన్స్ పోలీస్ రోల్ అంటే సాయి కుమారే చేయాలి అనేంతలా. అలా సినిమా సినిమాకు తనదైన నటనతో డైలాగ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. కెరీర్ లో ఎన్నో విభిన్న రకాల పాత్రలను పోషించారు. ప్రతి పాత్రలోనూ కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తారు. తన గొంతుతో అనేక మంది హీరోలకు డబ్బింగ్ చెప్పి, వారికి మరింత గుర్తింపు తెచ్చిపెట్టారు.
సుమన్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోలకు ఆయన గాత్రదానం చేశారు. బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్ కు సైతం డబ్బింగ్ చెప్పారు. ఆయన నటించిన ‘ఖుధా గవా’ అనే సినిమా ‘కొండవీటి సింహం’ పేరుతో తెలుగులోకి డబ్ కాగా.. అందులో బిగ్‌బీకి సాయి కుమార్ వాయిస్ఓవర్ అందించాడు. మోహన్‌లాల్, మమ్మూటీ, మనోజ్ జయన్, అర్జున్ సార్జా, విష్ణువర్ధన్ పోలీస్ రోల్స్‌కిగానూ.. సురేష్ గోపీ, విజయ్‌కాంత్ లాంటి వాళ్లకుసైతం డబ్బింగ్ చెప్పిన ఘనత ఆయనకే దక్కింది.
సాయి కుమార్ కెరీర్ లో మరో మైలు రాయి ‘ప్రస్థానం’ చిత్రం. ఈ చిత్రంలో ఆయన చేసిన డైలాగ్‌లు తనను డైలాగ్ కింగ్‌గా నిలబెట్టాయి. ‘ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు, విలన్లు లేరన్నాటకంలో’ అనే డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. హీరోగానే నుంచి విలన్‌గా.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న ఆయన..కెరీర్లో అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. అలాగే తన తమ్ముళ్లు రవిశంకర్, అయ్యప్ప పి. శర్మ కూడా సినీ రంగంలో రాణించడానికి ఆయనే ప్రేరణ. సాయి కుమార్ తనయుడు ఆది కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు.