జగన్‌పై అవంతి ఫైర్..వైసీపీలో నావల్ల కాదు
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, విశాఖపట్నం :- సంక్రాంతి లోపు వైసీపీ ఖాళీ అవుతుందా? కీలక నేతలకు ఆ పార్టీకి రాం రాం చెప్పే యోచనలో ఉన్నారా? రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీకి, పదవులకు రాం రాం చెప్పేశారు. రాజకీయాలే పరమావధిగా జగన్ ముందుకెళ్లడం నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. అంతేకాదు వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. గురువారం ఉదయం విశాఖలో మీడియాతో మాట్లాడిన అవంతి, రాజీనామా విషయాన్ని బయటపెట్టారు.
వైసీపీతో ఆయనకున్న బంధం తెగిందన్నమాట. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న ఆయన, కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలన్నారు. సమయం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలన్నది సరికాదన్నారు. కనీసం ఆరునెలలు తిరక్కుండా ప్రజల్లోకి వెళ్లి వారిని ఇబ్బంది పెట్టడం మంచిదికాదన్నారు.
కొంతైనా గ్యాప్ ఇవ్వకుండా జమిలి ఎన్నికలు వస్తున్నాయని, రేపటి నుంచి ధర్నాలు చేయాలని అధిష్టానం పిలుపు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు అవంతి. పార్టీలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లను సంప్రదించిన నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. బ్రిటీషర్లు సైతం నిర్ణయాలు లండన్‌లో తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేవారని వివరించారు.
ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలన్నారు అవంతి. ఏకపక్షం నిర్ణయాలు తీసుకుని, వాటిని నేతలు అమలు చేయాలని చెప్పడం సరికాదన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు సైతం ఇబ్బందిపడుతున్నారని చెప్పకనే చెప్పేశారు. తాడేపల్లిలో కూర్చొని చెప్పడం ఈజీ అని, అమలు చేయడం కష్టమన్నారు.
గడిచిన ఐదేళ్లు ప్రభుత్వ పాలనంతా వాలంటీర్ల మీదే నడిచిందన్నారు. దీనివల్ల కార్యకర్తలు, నేతలు చాలావరకు ఇబ్బంది పడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, తెలంగాణలో పదేళ్లు ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల కొంతలో కొంత అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు.
తనకు డబ్బు, పదవి కాదని, గౌరవం కావాలన్నారు. వైసీపీ అది దక్కలేదన్నది ఆయన మాట. గౌరవం ఎక్కడుంటే తాను అక్కడే ఉంటానన్నారు. రాజధాని అమరావతిపై మీ అభిప్రాయం ఏంటని మీడియా ప్రశ్నకు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ప్రజల అభిప్రాయమే తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. గతంలో విశాఖ రాజధాని అని పార్టీ చెప్పిందని, ప్రజలేమో అమరావతి అని చెప్పారంటూ తనదైనశైలిలో చెప్పుకొచ్చారు.
ఇప్పటికే మూడు పార్టీలు ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ మారారని, వ్యక్తిగత కోసం పార్టీ మారారా అంటూ ప్రశ్నకు వెరైటీగా చెప్పుకొచ్చారు. దశాబ్దమున్నర పాటు మీరు చూస్తున్నారని, తాను ఏమి లబ్దిపొందానో మీకు తెలుసన్నారు. తన కాలేజీలో ఫీజుల తగ్గించానని గుర్తు చేశారు. తనను నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తానన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా తననే ఉండమని జగన్ చెప్పారని, తాను ఉండలేన్నారు అవంతి. ఏపీ ఎలావుంది, తెలంగాణ ఎలావుందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. సొసైటీ ఎజెండా చాలా ముఖ్యమన్నారు. మీ అమ్మాయి కూడా దూరంగా ఉంటుందా? అది ఆమె ఇష్టమన్నారు.