రండీ తేల్చుకుందాం..సీఎం రేవంత్ రెడ్డి సవాల్
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, హైదరాబాద్ :- ఢిల్లీలో ఉండే మోడీ అయినా, గల్లీలోని కేడీ అయినా.. రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు గట్టి సవాల్ విసిరారు. కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి, వ్యవసాయాన్ని దండుగ నుంచి పండుగగా మార్చిన ఘనత తమదంటూ రేవంత్ రెడ్డి గర్వంగా చెప్పుకొచ్చారు. 24 గంటల ఉచిత కరెంట్, రుణ మాఫీ సహా రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు.
చర్చకు సిద్ధమా..?
ఈ నేపథ్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేసిన పనులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు రేవంత్ సవాల్ చేశారు. రైతుల బాగు కోసం ఎవరు ఎంత చేశారో తేల్చుకునేందుకు రావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు, పథకాలను అమలు చేస్తోందన్నారు సీఎం. అనేక కష్టాలు ఎదురైనప్పటికీ సమస్యలను అధిగమించి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
రైస్ ఉత్పత్తి, కొనుగోలు..
ఈ క్రమంలో తెలంగాణ రైతులు ఈ ఏడాది 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసినట్లు సీఎం గుర్తు చేశారు. ప్రజా పాలనలో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కేవలం 9 రోజుల వ్యవధిలో రూ.9వేల కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రైతులకు ఆర్థిక భరోసాను అందించడమే కాకుండా, వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ముఖ్య అతిథిగా..
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం, రైతు సంక్షేమం, ఆర్థిక పునరుద్ధరణ కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సామాజిక న్యాయ విజయ భేరి సభలో సీఎం ఈ మేరకు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతోపాటు అనేక మంది కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.