టీ 20 ప్రపంచకప్ .. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెడీ?
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, క్రీడా వార్తలు :- టీ 20 వరల్డ్ కప్ టీమ్ ను సెలక్ట్ చేసేందుకు అగార్కర్ నేపథ్యంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ సౌతాఫ్రికా వెళ్లిన సంగతి తెలిసిందే. రెండో టెస్ట్ మ్యాచ్ ఒకటిన్నర రోజులోనే అయిపోవడంతో ప్లేయర్లు అందరూ రిలాక్స్ గా ఉన్నారు. అయితే రిటర్న్ టిక్కెట్లు, రెండో టెస్ట్ ముగిసే జనవరి 7 తర్వాత తీశారు. కాబట్టి ముందుగా రావడానికి లేదు. అంతా అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు.
దీంతో సెలక్షన్ కమిటీకి మంచి అవకాశం దొరికింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరితో మాట్లాడేందుకు సమయం కూడా చిక్కింది. వీరిద్దరూ టీ 20 ప్రపంచ కప్ లో ఆడతారా? లేదా? అనే ప్రశ్నకైతే సమాధానం దొరికిందని అంటున్నారు. ఇద్దరూ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు. అంతేకాదు ఇద్దరికి కూడా బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.
రోహిత్ శర్మకి ఎలాగూ కెప్టెన్సీ అప్పగిస్తారు. విరాట్ కి ఏం చెబుతారని నెట్టింట రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి.
జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమ్ ఇండియా ఆడే ఆఖరి టీ 20 సిరీస్ ఇదే.
అయితే తర్వాత ఐపీఎల్ జరుగుతుంది. ఇందులో రకరకాల జట్ల తరపున టీమ్ ఇండియా ప్లేయర్లు అందరూ ఆడుతున్నారు. అందులో ఎవరు ఫామ్ లో ఉన్నారు? ఎవరు లేరు అనేది తేలిపోతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ముందు వీళ్లిద్దరి సంగతి తేలిపోతే, తర్వాత టీమ్ ని సెట్ చేయవచ్చనే భావనలో సెలక్షన్ కమిటీ ఉంది. మొత్తానికి ఇద్దరు సీనియర్లు టీ 20 వరల్డ్ కప్ లో ఆడనున్నారనే వార్త అయితే హల్చల్ చేస్తోంది.
ఈసారి మినీ వరల్డ్ కప్ కొట్టి ఇద్దరూ ఇక టీ 20ల నుంచి తప్పుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కొత్తవారికి అవకాశాలు ఇస్తారని అంటున్నారు. అప్పుడు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ముందుకు నడిపిస్తారని చెబుతున్నారు.