క్రీడా వార్తలు

భారత్ క్రికెట్ సెలక్షన్ కమిటీకి కొత్త ఛైర్మన్ .. అజిత్ అగార్కర్ కు బాధ్యతలు..

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: మాజీ క్రికెటర్ అజిత్‌ అగార్కర్‌ భారత్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఎంపికయ్యాడు. బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ ఈ మాజీ పేసర్ బౌలర్ ను ఉన్నత పదవికి ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. సులక్షణ నాయక్‌, అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరాంజపె సభ్యులుగా ఉన్న క్రికెట్‌ సలహా కమిటీ ..సెలక్షన్‌ కమిటీలో ఖాళీ అయిన స్థానానికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఏకగ్రీవంగా అగార్కర్‌ను ఎంపిక చేసింది. సలీల్‌ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శరత్‌, ఎస్‌ఎస్‌ దాస్‌ ప్రస్తుతం సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు వారందరికంటే అజిత్ అగార్కర్ కే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ గా అగార్కర్ ను ఎంపిక చేశారు.

కొన్ని నెలల కిందట అప్పట చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ టీమిండియా క్రికెటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో బయటికి రావడంతో చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు చీఫ్ సెలక్టర్ స్థానాన్ని అగార్కర్‌ తో భర్తీ చేశారు.

45 ఏళ్ల అగార్కర్‌ 1998-2007 మధ్య టీమిండియా తరఫున ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన జట్టులో అగార్కర్ ఉన్నాడు.‌ 1999, 2003, 2007 వన్డే ప్రపంచకప్‌ల్లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 191 వన్డేల్లో 288 వికెట్లు, 26 టెస్టుల్లో 58 వికెట్లు , 4 టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. లార్డ్స్‌లో టెస్టు సెంచరీ సాధించిన అరుదైన ఘనత సాధించాడు.

భారత్‌ తరఫున వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సాధించిన రికార్డు నెలకొల్పాడు. 2000లో జింబాబ్వేపై 21 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. 2004లో ఆస్ట్రేలియాపై అడిలైడ్‌ టెస్టులో భారత్‌ సాధించిన చారిత్రక విజయంలో అగార్కర్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 6 వికెట్ల తీశాడు. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత అగార్కర్‌ కామెంటేటర్ గా కొనసాగాడు.

Leave a Reply