తెలంగాణ

దావోస్‌లో పెట్టుబడుల వేట.. పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు..

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, తెలంగాణ :- స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. సీఎం టీమ్‌ దావోస్‌ పర్యటన తెలంగాణకు పెట్టుబడుల వరదను పారిస్తోంది. తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి.. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో భేటీ అయ్యారు. వరంగల్‌ నగరానికి విప్రో కంపెనీ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు.

అంతకుముందు టాటాసన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌, గ్లోబల్‌ హెల్త్‌ స్ట్రాటజీ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియం వార్‌, ప్రతినిధులను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు.

అంతకుముందు అదానీ కంపెనీలు తెలంగాణలోనూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో గౌతమ్‌ అదానీతో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. దాని తర్వాత.. వచ్చే కొన్ని సంవత్సరాల్లో తెలంగాణలో దాదాపుగా 12వేల 400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్‌ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నది.

అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు కోసం 5వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. అటు మరో 5వేల కోట్ల పెట్టుబడితో చందన్‌వెల్లిలో వంద మెగావాట్ల సామర్థ్యంతో అదానీ డేటా సెంటర్ క్యాంపస్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌లో 1400 కోట్లు, అదానీ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ సెక్టార్‌లో మరో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలు అందజేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుదారులకు అత్యంత అనుకూలమైనదని చెప్పారు. కొత్త ప్రణాళికవిధానాలతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని.. అలా తెలంగాణలో అదానీ గ్రూప్‌ జెట్‌ స్పీడ్‌తో అభివృద్ధి చెందుతుంది అన్నారు.

Leave a Reply