300 అడుగుల బోరు బావిలో పడిపోయిన చిన్నారి..
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం 300 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో పడిపోయింది రెండున్నరేళ్ల చిన్నారి. కాగా చిన్నారి ప్రస్తుత పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సీహోర్ జిల్లా ముగావళి గ్రామానికి చెందిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం నుంచే సహాయక చర్యలు ప్రారంభించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 6 ప్రొక్లేయినర్లు, జేసీబీ ఇతర యంత్రాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్య్కూ ఆపరేషన్ చేపట్టింది. తాడు సహాయంతో చిన్నారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదట 30 అడుగుల లోతులో ఉన్న చిన్నారి ప్రస్తుతం 50 అడుగుల లోతులోకి జారినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. తన సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేసి, చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.