ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన .. 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం..

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్ పోర్ట్ నిర్మా­ణానికి శంకుస్థాపన చేశారు. రూ.4,592 కోట్లతో ఈ విమానాశ్రయం నిర్మిస్తారు. భోగాపురం ఎయిర్ పోర్టును 36 నెలల్లో నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2,203 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. 3.8 కిలోమీటర్ల రన్‌వే ఏర్పాటు చేస్తారు.

దేశీయ, అంతర్జాతీయ రవాణాకు ఉపయోగపడేలా కార్గో టెర్మినల్‌ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తారు. ఆ తర్వాత ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను పెంచుతారు. తొలిదశలో 5 వేల చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తారు. విశాఖ–భోగాపురం మధ్య రూ.6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మిస్తారు. రెండువైపులా సర్వీసు రోడ్లు అందుబాటులోకి తీసుకొస్తారు.

పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో నిర్మించే ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ కు సీఎం శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లాలో రూ. 194.90 కోట్లతో చేపట్టే తారకరామ తీర్థ సాగర పెండింగ్ పనులను సీఎం జగన్ ప్రారంభిస్తారు. 2024 డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు.

విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్‌ నిర్మించే వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలో రూ.14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్‌ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు.

Leave a Reply