నేటితో వైసీపీ సర్కార్ పాలనకు నాలుగేళ్లు.. 98.5 శాతం హామీలు అమలు చేశారా..?
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ సర్కార్ పాలనకు నాలుగేళ్లు పూర్తైంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని సీఎం జగన్ పదేపదే చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చామంటున్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధంలేకుండా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అంటున్నారు. చెప్పిన మాట ప్రకారం సంక్షేమాభివృద్ధి పథకాల అమలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించాలన్న లక్ష్యంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు చేపట్టారు. ఎన్నికలకు ఏడాది ముందే ప్రతి ఇంటికి వెళుతున్నారు. ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారులను కలుస్తున్నారు. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు.
మరో పక్క వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పరిపాలనలో సంస్కరణల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. గ్రామ, వార్డుస్థాయికి పరిపాలనను, పథకాలను, పౌర సేవలను పారదర్శకంగా తీసుకెళ్లామని అంటోంది. గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని చెబుతోంది.
గత నాలుగేళ్లలో అన్ని వర్గాలకు నవరత్నాల కింద డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.3.02 లక్షల కోట్లు వ్యయం చేశామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇందులో డీబీటీ ద్వారా రూ.2.11 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశామని ప్రకటించింది. నాన్ డీబీటీ ద్వారా రూ.91 వేల కోట్లు వ్యయం చేశామని వెల్లడించింది. సీఎం జగన్ చెబుతున్నట్లు 98.5 శాతం హామీలు అమలయ్యాయా..?